ఆంధ్రప్రదేశ్‌లో తర్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో  కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన కేబినెట్ సహచరులకు పలు విషయాలను చెప్పారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ (cabinet expansion) ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. కొందరు మంత్రులకు తప్పించనున్నట్టుగా ఆయన తెలిపారు. పదవి నుంచి తప్పించిన మంత్రులు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వెల్లడించారు. ఇక, కొంత మందిని మాత్రం మంత్రివర్గంలో కొనసాగించనున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు. 

మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కన పెట్టినట్లు భావించొద్దని సీఎం జగన్ చెప్పారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని అన్నారు.ఇక, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో.. కొందరు మంత్రుల్లో ఆందోళన నెలకొంది. కేబినెట్‌లో కొనసాగేది ఎవరు.. ఎవరిని తొలగిస్తారనే ఉత్కంఠ వైసీపీ నాయకుల్లో నెలకొంది. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవులుపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం లభిస్తుందమోనని ఎదురుచూస్తున్నారు.ఇక, ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో నలుగురు డిప్యూటీ సీఎంలు, 19 మంది మంత్రులు ఉన్నారు. 

ఇక, గత కొంతకాలంగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడుతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ పలువురికి హామీ ఇచ్చినట్టుగా వైసీపీ శ్రేణులు చెబుతాయి.

అయితే వైఎస్ జగన్ చెప్పిన ఆ రెండున్నరేళ్ల గడువు పూర్తయిపోయింది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు.. అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. పలుమార్లు ప్రచారం జరిగిన అలాంటిదేమి చోటుచేసుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో.. ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది.

ఇక, సీఎం జగన్ కేబినెట్‌ కూర్పు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. వైసీపీ సర్కార్ ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మంత్రులను కొత్త జిల్లాల ప్రతిపాదకన తీసుకుంటారా..? లేక ఇప్పుడున్న జిల్లాల వారీగా తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.