విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలు, తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేసిన ఆయన ఇవాళ ఎనిమిదవ శ్వేతపత్రం విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగాలపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చడం ద్వారా రూ.1,138 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని తెలిపారు. 2,071 గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. పంచాయతీ, అంగన్‌వాడీ, స్కూల్ బిల్డింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని చంద్రబాబు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో మొత్తం రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టామని మరో రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

గ్రామాల్లో 2,251 స్మశాన వాటికలు నిర్మించామని, 4,249 నిర్మాణ దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలకు ప్రహారీ గోడలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 124 పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించామని, మరో 3,523 పాఠశాలలకు పనులు ప్రారంభించామన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో ప్రహారీ గోడలు నిర్మిస్తామని బాబు ప్రకటించారు. 2020 నాటికి తాగునీటి సమస్యను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా పట్టణ ప్రాంతాల్లో సైతం నీరు అందించగలిగామన్నారు. తెలంగాణలో 40 శాతం ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రూ.56,000 కోట్లు ఖర్చు పెడితే.. ఏపీ ప్రభుత్వం కేవలం రూ.15,874 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా రూ. 4,115 కోట్లు ఖర్చు పెట్టి , 38 లక్షల 64 వేల కుటుంబాలకు మరుగుదోడ్లు కట్టించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర అవసరాల నిమిత్తం 9 వేల కంపోస్ట్ కేంద్రాలు కావాలని ఆయన అన్నారు.

14 వేల ఎలక్ట్రిక్ వాహణాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. 2000 జనాభా దాటిన ప్రతి గ్రామంలోనూ భూగర్భ పారిశుద్ధ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. చేపలు ఎండబెట్టడానికి ఫ్లాట్ ఫాంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగర వనం, గ్రామవనం కింద పచ్చదనం పెంపోందిస్తున్నట్లు తెలిపారు. గోకులం, మినీ గోకులం ద్వారా పశువుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

45, 288 మైనర్ ఇరిగేషన్ ప్లాంట్లకు మరమ్మత్తులు చేశామని, రూ. 530 కోట్లు ఖర్చు చేసి 42,458 చెక్‌డ్యాంలు, రూ.1,480 కోట్ల వ్యయంతో పర్క్‌లేషన్ ట్యాంకులు 31, 000 నిర్మించామని చంద్రబాబు తెలిపారు. గ్రామాలకు టెన్ స్టార్ రేటింగ్ ఇచ్చామని.. తద్వారా పోటీతత్వం పెరిగిందన్నారు. 100 శాతం మరుగుదొడ్లు, 100 శాతం గ్యాస్, 100 శాతం కరెంట్ సరఫరా ఇచ్చామన్నారు. ఈ విభాగంగా విశాఖ, కడప, అనంతపురం జిల్లాలు మంచి ప్రతిభ కనబరిచాయన్నారు.

సాలీడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో కృష్ణా, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ రంగంలో అద్బుతంగా రాణిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రోడ్ కనెక్టివిటిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు టాప్‌లో ఉన్నాయని, ఫైబర్ నెట్ కనెక్టివిటీలో కొత్తగా 3 మిలియన్ల కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం మంచి ప్రదర్శన చూపిస్తున్నాయని వెల్లడించారు. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనలో ఉత్తరాంధ్ర జిల్లాలు దూసుకెళ్తున్నాయని, వైద్య రంగంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మంచి స్థానంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

365 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి రోజుకి 1.6 లక్షల ప్లేట్ల ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నామని వెల్లడించారు.  రూరల్ ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గుర్తించి ఇప్పటి వరకు 92 పురస్కారాలు దక్కడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.  12 లక్షల 95 వేల 830 మందికి మెప్మా కింద నెలకు 10 వేల పైన ఆదాయం వస్తోందన్నారు.

325 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రక్షిత మంచినీటిని ఇస్తున్నామని సీఎం తెలిపారు. నాలుగున్నరేళ్లలో 25 వేల కి.మీ బిటీ రోడ్లు వేశామని, మరో 18 వేల కి.మీ వేస్తే అన్ని గ్రామాల్లో 100 రోడ్లు పూర్తవుతాయిన ముఖ్యమంత్రి వెల్లడించారు. నిధుల వినియోగంపై పారదర్శకంగా వ్యవహరించామన్నారు.