Asianet News TeluguAsianet News Telugu

అలీకి టీడీపీకి దగ్గర బంధం ఉంది, రాజకీయాల్లోకి వస్తే నేను అండగా ఉంటా: చంద్రబాబు ఆఫర్

అలీకి తెలుగుదేశం పార్టీకి ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు. గతంలో అలీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. అలీ రాజకీయాల్లోకి వచ్చి నూతనమైన రాజకీయ ఒరవడి సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

ap cm chandrababu naidu welcomes to ali political entry
Author
Vijayawada, First Published Feb 24, 2019, 6:52 AM IST

విజయవాడ: సినీనటుడు అలీ రాజకీయాల్లోకి వస్తే తాను అండగా నిలుస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాజకీయాల్లోచేరి మరింత క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు ఆకాంక్షించారు. 

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీ  సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కంకణం బహుకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అలీకి తెలుగుదేశం పార్టీకి ఎంతో దగ్గర సంబంధం ఉందన్నారు. గతంలో అలీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. అలీ రాజకీయాల్లోకి వచ్చి నూతనమైన రాజకీయ ఒరవడి సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

అలీ రాజకీయ ప్రవేశం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా జీవితంలోకి ప్రవేశించారని గుర్తు చేశారు. 60 ఏళ్లు సినిమాలు చేసిన ఆయన శేష జీవితాన్ని ప్రజలకు అంకితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 

తెలుగువాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీఆర్ వల్లేనని చెప్పుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాతే చాలా మంది నటనను కెరీర్ గా ఎంచుకున్నారని తెలిపారు. అలీ అన్ని తరాల నటులకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. 

నటుడుగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఒక పేదకుటుంబంలో పుట్టినా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హాస్య నటులు కూడా అంతే ముఖ్యమన్నారు. 

అలాగే 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఓ మంచి వ్యక్తిని అభినందించాలన్న ఉద్దేశంతో తాను కూడా భాగస్వామిని కావాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. అలీ నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆకాంక్షించారు. 

జీవితంలో రిలాక్సేషన్స్ రావాలంటే అలీ లాంటి వ్యక్తులు ఎంతో అవసరమన్నారు. అలీకి వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప సబాపతి మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై అలీని అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios