అమరావతి: కియా మోటార్స్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో కియా మోటార్స్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ కార్ల రీఛార్జి స్టేషన్ ను సీఎం ప్రారంభించారు. 

అనంతరం కియా మోటార్స్ వారి ఎలక్ట్రికల్ కారులో సీఎం చంద్రబాబు ప్రయాణించారు. కారు యెుక్క ఫీచర్స్ అడిగి తెలుసుకున్నారు. తాను తొలిసారిగా ఎలక్ట్రికల్ కారులో ప్రయాణించానని సౌకర్యవంతంగా ఉందని చద్రబాబు తెలిపారు. 

కియా తొలి కారు జనవరిలో బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ తయారైన కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. కియా మోటార్స్ తోపాటు అనేక పరిశ్రమలు ఏపీకి క్యూ కట్టబోతున్నాయని తర్వాలోనే ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిపోనుందన్నారు. 
 
రాబోయే కాలంలో యూనిట్‌ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభ్యంకానుందని ఆ దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. త్వరలో 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వ్యర్ధాల సేకరణలో వినియోగిస్తామని తెలిపారు. 

పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఇది కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా చంద్రబాబు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
 
ఎలక్ట్రిక్ కార్ల రీచార్జ్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను ఏపీ ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది. ఈ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.