తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్నేహ హస్తం అందించినా కేసీఆర్‌ కలిసిరాలేదని తెలిపారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ వ్యవహార శైలిపై చంద్రబాబు పలు కీలక విషయాలు తెలిపారు. 

అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్నేహ హస్తం అందించినా కేసీఆర్‌ కలిసిరాలేదని తెలిపారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ వ్యవహార శైలిపై చంద్రబాబు పలు కీలక విషయాలు తెలిపారు. 

ఇద్దరం కలుద్దామని కేసీఆర్‌తో చెప్పానన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి ఉండాలని కేసీఆర్‌కు చెబితే.. కేసీఆర్‌ ఆలోచించి చెబుతానన్నారని తెలిపారు. వారం తర్వాత కుదరదని కేసీఆర్ బదులిచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీని ఒంటరిగా పోటీచేయించమని కేసీఆర్ సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దని అన్నారని స్పష్టం చేశారు. అప్పటికే కేసీఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్ధమైందన్నారు. 

2014 ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో జగన్ వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తానే సమర్ధుడిగా చలామణి కావొచ్చని కేసీఆర్‌ ఆశించారన్నారు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశలను తారుమారు చేశారన్నారు.

మరోవైపు బీజేపీ, వైసీపీ రహస్య పొత్తుపై అనేక కథనాలు వస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బీజేపీకి 15 సీట్లు వదులుకునేందుకు జగన్‌ సిద్ధమయ్యాడని తెలుస్తోందని తెలిపారు. గుంటూరులో కన్నాకు లాభం చేసేందుకే అప్పిరెడ్డిని తప్పించారని సమాచారం ఉందన్నారు. 

వైసీపీ అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి చంద్రబాబు, వెంకయ్య ఉన్నారని మోదీనే చెప్పారని గుర్తు చేశారు. మోదీ అన్నమాటలు ఆయన నైజానికి నిదర్శనమన్నారు. 

నమ్మిన బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇక జాతీయస్థాయిలో కొత్త పొత్తులు మినహా మరో మార్గం లేదన్నారు. వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.