ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇళ్లు, కార్యాలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు, సమైక్యాంధ్రకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ఐటీ సలహాదారుగా ఉన్న హనుమాన్ చౌదరి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు ఏపీ సీఎం తన ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చును తెలుసుకున్నారు.

నివేదిక ప్రకారం చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు రూ.9 కోట్లను ఖర్చు చేశారు. ఇందులో రూ.5.26 కోట్లను దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసం మరమ్మత్తులకు వినియోగించారు. రూ.2.6 కోట్లను అమరావతిలోని అధికారిక నివాసంతో పాటు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం మెరుగులు దిద్దడానికి ఖర్చు చేశారు.

మరో రూ.94 లక్షలను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నిర్మాణంతో పాటు మిని సచివాలయం నిర్మాణానికి వెచ్చించారు. అక్కడ పోలీస్ పహారాతో పాటు ఇతర భద్రతా చర్యల కోసం రూ. 59 లక్షలు, ఆ భవనానికి నీటి పన్ను నిమిత్తం రూ.3 లక్షలను ఖర్చు చేసినట్లు ఆర్టీఐ స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో అమరావతి నుంచే పరిపాలన సాగిస్తున్నందున ఆయన ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని హనుమాన్ చౌదరి ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడంలో లేదంటూ కేంద్రంపై విరుచుకుపడే చంద్రబాబు తన ఇళ్లు, కార్యాలయాల కోసం స్వేచ్ఛగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని చౌదరి ఆరోపించారు.

వీటన్నింటిని పక్కనబెడితే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో సీఎం కొద్దిరోజులు బస చేశారని ఇది అనైతికమైన ఖర్చుగా హనుమాన్ చౌదరి అభివర్ణించారు. 5.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని చౌదరి ప్రశ్నించారు.

అది పూర్తిగా నిర్మించబడే వరకు ఆ భూమి మొత్తం ఖాళీగా ఉండాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

అంతేకాకుండా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి నారా లోకేశ్‌ను ఎంపిక చేయడంపై చౌదరి మండిపడ్డారు. మంత్రివర్గంలో ఎంతోమంది మంది సీనియర్లు ఉన్నారు. అపార అనుభవం ఉన్న ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడికి అవకాశం ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దార్శనికత, ముందుచూపుతో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని.. కానీ నేడు ఆయనలో ఆ పరిపక్వత లేదని హనుమాన్ చౌదరి వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, కానీ దానిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు హనుమాన్ చౌదరి వ్యాఖ్యలపై ఏపీ ప్లానింగ్ కమిషన్ వైఎస్ ఛైర్మన్ కుటుంబరావు స్పందించారు. హనుమాన్ బీజేపీ వైపు మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.లక్ష కోట్ల గురించి ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కుటుంబరావు డిమాండ్ చేశారు.