అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ బోర్డు చైర్మన్ గా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటూ నిర్ణయం ప్రకటించింది మంత్రి మండలి. 

2018లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఈడీబీ చట్టాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యాక్ట్‌ –2019 ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది. 

పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్, పర్యవేక్షణ, ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనలే లక్ష్యంగా ఈ బోర్డు పనిచేయనుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ బోర్డులో ఏడుగురు డైరెక్టర్లను నియమించనున్నారు. 

ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు, చీఫ్‌ సెక్రటరీలు డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. ఏపీఐపీఎంఏలో శాశ్వత ప్రత్యేక సలహామండలిగా ఏపీఈడీబీ వ్యవహరించనుంది. ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక నిపుణులతో ఈ బోర్డు సంప్రదింపులు జరపనుంది. 

ఇకపోతే ఈ బోర్డు 
ప్రధాన కార్యాలయం విజయవాడ, హైదరాబాద్‌లలో ఏర్పాటు చేయనున్నారు. యువపారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, వారికి శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు 
గతంలో ఏపీఈడీబీలో అవసరానికి మించి భారీ సంఖ్యలో పదవులు, పక్షపాతం, అవినీతి, విదేశీ పర్యటనల పేరిట దుబారా చేశారని మంత్రి వర్గం గుర్తించింది.  

అలాగే 200 యూనిట్ల విద్యుత్ ను ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,62,684 మంది ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలు లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.411 కోట్లు భారం పడనుంది.

మరోవైపు సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. వైయస్ఆర్ నవోదయం పేరుతో కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.  

గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు వైయస్ఆర్ నవోదయం పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 86వేలమంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. 
 
అందులో భాగంగా రూ.4 వేల కోట్ల రుణాలు వన్‌టైం రీస్ట్రక్చర్‌ చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ టైం రీ స్ట్రక్చర్ విధానం వల్ల ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపింది.  
 
మరోవైపు రాష్ట్రంలో స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల పర్యవేక్షణ నియంత్రణలపై ముసాయిదా బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ద్వారా పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్‌ల ఏర్పాటు చేయనుంది. విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపైనా ఏపీ కేబినెట్‌ ప్రత్యేక దృష్టి సారించింది.