AP Budget 2023-24:ఆమోదం తెలిపిన కేబినెట్
ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఏపీ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24 కు ఏపీ కేబినెట్ గురువారంనాడు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం గురువారంనాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2023-24 కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా ఏపీ వ్యవసాయ శాఖ బడ్జెట్ కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. రూ. 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం.
అసెంబ్లీలో ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. శాసనమండలిలో ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. నవరత్నాలకు బడ్జెట్ లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం, విద్య,వైద్యం , సంక్షేమం, పేదల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
మహిళా సాధికారితకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.మహిళలు, పిల్లల కోసం బడ్జెట్ లో కేటాయింపులుండనున్నాయి. అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. శాసనమండలిలో మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. 2024లో ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదే పూర్తిస్థాయి బడ్జెట్ ను జగన్ ప్రభుత్వం పెట్టనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు.