సారాంశం
తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాయలం ఈరోజు ప్రారంభమైంది.
గుంటూరు: తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాయలం ఈరోజు ప్రారంభమైంది. గుంటూరులో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ ఆఫీసు వెలుపల పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఇక, గుంటూరులో మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో బీఆర్ఎస్ ఏపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐదు అంతస్తుల భవనంలో మొదటి, రెండో అంతస్తుల్లో కాన్ఫరెన్స్ హాళ్లు ఉన్నారు. మూడు, నాలుగో అంతస్తుల్లో పార్టీ కార్యవర్గ కార్యాలయాలు ఉంటాయి. ఐదవ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కోసం ప్రత్యేక ఛాంబర్, సమావేశ మందిరం ఉంటుంది. ఇక, భవనంలో దాదాపు 16 గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఏపీ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించాలని బీఆర్‌ఎస్ అధిష్టానం తొలుత భావించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వివిధ కారణాల వల్ల తన నిర్ణయాన్ని మార్చుకుని చివరకు గుంటూరు వైపే మొగ్గు చూపింది. అయితే ఏపీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు.