Asianet News TeluguAsianet News Telugu

బిజెపి మరో ట్వీట్: వైఎస్ జగన్, చంద్రబాబులను టార్గెట్ చేస్తూ...

తమ పార్టీ రాజధాని అంశంపై ఏంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేసిన తర్వాత ఏపీ బిజెపి మరో ట్వీట్ చేసింది. ఏపీ సీఎం జగన్ ను, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆ ట్వీట్ చేసింది.

AP BJP targets YS Jagan and Chnadrababu
Author
Amaravathi, First Published Jul 31, 2020, 10:26 AM IST

అమరావతి: రాజధాని విషయంలో తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలను తప్పు పడుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బిజెపి మరో ట్వీట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుకూలంగా తాము ఉన్నట్లు కనిపించకూడదనే ఉద్దేశంతో లేదా తమ తాము రెండు పార్టీలను సమ దూరంలో ఉంచుతామని చెప్పడానికో బిజెపి ఆ ట్వీట్ చేసింది.

వైఎస్సార్ కాంగ్రెసు, టీడీపీలకు సమదూరం పాటిస్తామని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ విధానాన్ని అత్యంత స్పష్టంగా చెప్పడానికి కూడా రాష్ట్ర బిజెపి ఆ ట్వీట్ చేసి ఉంటుంది. టీడీపీ చంద్రబాబు, వారి కుమారుడి పార్టీ అని బిజెపి ట్విట్ లో వ్యాఖ్యానించింది. అలాగే వైసీపీ జగన్ కుటుంబ పార్టీ అని చెప్పింది. 

అదే సమయంలో తమది మాత్రమే రాష్ట్రంలో సకల జనుల పార్టీ అని, దేశ హితం కోసం జాతి, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరి కోసం శ్రమించే పార్టీ తమ బిజెపి ఒక్కటే అని ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు. పార్టీ విధానాలను కచ్చితంగా పాటించే విధంగా నాయకులను హెచ్చరించడం కూడా ఆ ట్వీట్ లోని ఉద్దేశం కావచ్చు.

 

ఇదిలావుంటే, తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరికి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు షాక్ ఇచ్చిన విషయ తెలిసిందే. బిజెపి అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన ఆయన తాను ఎలా ఉండబోతున్నాననే విషయాన్ని సుజనా చౌదరికి షాక్ ఇవ్వడం ద్వారా స్పష్టం చేశారు. 

అమరావతి విషయంలో సుజనా చౌదరి ప్రకటనలు ఇక ముందు సాగే అవకాశం ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో కేంద్రం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని సుజనా చౌదరి గురువారం చెప్పారు. దాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ బిజెపి ఖండించింది. రాష్ట్ర బిజెపి వైఖరిని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి గురువారం అన్నారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటన చేసిన కొద్దిసేపటికే సుజనా చౌదరి ఆ విషయంపై మాట్లాడారు. కన్నా లక్ష్మినారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సుజనా చౌదరి అదే విధంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆయనకు వ్యతిరేకత ఎదురు కాలేదు. 

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదనను సుజనా చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రం బూచిని చూపిస్తూ వస్తున్నారు. అయితే, సుజనా చౌదరి మాటలకు చెల్లుబాటు లేదని ఒక్క మాటతో బిజెపి స్ఫష్టం చేసింది. 

రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీకి విరుద్ధమని బిజెపి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రబుత్వం పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారని వివరించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాటంలో సుజనా చౌదరి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు సోము వీర్రాజు కళ్లెం వేయడానికి సిద్ధపడినట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. బిజెపిలో ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సుజనా చౌదరి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గతంలో విమర్శించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

తాజా పరిణామంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించినట్లే. సుజనా చౌదరితో పాటు కొంత మంది బిజెపి నాయకులు మూడు రాజధానుల విషయంలో తనకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ఆగిపోతాయని ఆయన భావించడానికి వీలుంది.

Follow Us:
Download App:
  • android
  • ios