హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారంనాడు టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను కలిశారు. రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన సోము వీర్రాజు కొద్దిసేపు అక్కడే గడిపారు. 

ఆ సమయంలో నటి హేమ కూడా అక్కడే ఉన్నారు. ఈ విషయాన్ని సోము వీర్రాజు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రముఖ హాస్యనటుడు, సోదర సమానులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. 

తెలుగు చిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజలకు ఆయన అందిస్తున్న సేవల పట్ల  అభినందించానని పేర్కొన్నారు. కాగా, తన నివాసానికి వచ్చిన ఏపీ బీజేపీ చీఫ్ ను రాజేంద్రప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. అనంతరం ఇరువురూ కొద్దిసేపు ముచ్చటించారు.

అయితే, సోము వీర్రాజు రాజేంద్ర ప్రసాద్ ను కలవడం వెనక గల మతలబు ఏమిటనే విషయంపై చర్చ సాగుతోంది. తాను బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సోము వీర్రాజు చురుగ్గా ఉంటున్నారు. పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. 

ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజు రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు.