బీజేపీతోనే జనసేన.. అనుమానమా, పవన్‌ని అడగండి : పొత్తులపై మరోసారి తేల్చేసిన సోము వీర్రాజు
బీజేపీ , జనసేన పార్టీల మధ్య పొత్తులకు సంబంధించి సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలుంటే పవన్‌నే అడగాలని ఆయన సూచించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ముందు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బలాదూర్ అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేంద్ర పథకాలపై చంద్రబాబు, జగన్ చర్చకు సిద్ధమా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. బీజేపీతోనే వుంటామని పవన్ స్వయంగా చెప్పారని ఆయన తెలిపారు. బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలుంటే పవన్‌నే అడగాలని సోము వీర్రాజు పేర్కొన్నారు . 2024లో బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. పొత్తులకు సంబంధించి జనసేన, బీజేపీ మధ్య గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. తాను బీజేపీతోనే వున్నానని పవన్ కల్యాణ్ చెబుతుంటే.. కాషాయ నేతలు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బీజేపీతో పొత్తులోనే వున్నామంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని అన్నారు. పొత్తులపై తామిద్దరం క్లారిటీతో వున్నామని.. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఆయన పేర్కొన్నారు. అయితే మధ్యాహ్నం సోము వీర్రాజు మాటలకు వున్న వ్యత్యాసంపై ఏపీలో చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు కొనసాగుతారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రకటించారు.
ALso REad: పొత్తులపై మాట మార్చిన సోము వీర్రాజు.. పవన్ చెప్పారుగా, కన్‌ఫ్యూజన్ లేదన్న ఏపీ బీజేపీ చీఫ్
రెండ్రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, వచ్చే ఎన్నికలు, ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా చేసిన రాజకీయ తీర్మానంలో జనసేనతో పొత్తు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం చర్చకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలతో ఎలాంటి పొత్తు వుండదని అందులో తెలిపారు. కేవలం ప్రజలతోనే బీజేపీ పొత్తు వుంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో వైసీపీ అధోగతి పాలనపై పోరాటం చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడంపై ఇందులో దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. పొత్తు, ఎత్తులతో బీజేపీకి సంబంధం లేదని .. కేవలం భావ సారుప్యత కలిగిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని తీర్మానించారు.
మరోవైపు.. ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. అనంతపరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పొత్తులపై వారం రోజుల ముందు స్పష్టత వస్తుందన్నారు. కొత్త పొత్తులు కలిస్తే కొత్త వారితో కలిసి వెళ్తామని.. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.2014 కాంబినేషన్ ను కాలమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ బీజేపీతోనే ఉందన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు ను ఆహ్వానిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తులపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయన్నారు. ఓట్లు చీలకుండా ఉండాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు. తమ పార్టీకి బీజేపీ మధ్య మైత్రి ఉందని చెప్పారు.