ఏపీలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని ఆరోపించారు బీజేపీ నేతలు. వరదలతో రైతులు నష్టపోయినా వారిని పట్టించుకునే పరిస్ధితి లేదని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలతో ఏపీ బీజేపీ నేతలు వర్చువల్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పంట నష్టాన్ని వివరించారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పార్టీ ఎంపీలు తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనుకుని సాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు బీజేపీ నేతలు.

పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. రాయలసీమలో శెనగ పంట నీటిపాలయిందని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లెటర్‌ రాసి వదిలేసిందని ఎంపీ సీఎం రమేష్‌ తప్పుబట్టారు.

కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని, కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పంట నష్టం అంచనా వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సబ్సిడీ, పనిముట్లు, ఎరువులు ఇవ్వడంలేదని, రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీఎం రమేష్‌ డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీలో తీవ్ర నష్టం జరిగింది. వర్షాలకు చేతికి వచ్చిన పంట దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. రాయలసీమ ప్రాంతంలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట నష్టం జరిగిందని, రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.