Asianet News TeluguAsianet News Telugu

పాతదే బెటర్.. ఏపీ నూతన పారిశ్రామిక విధానంపై సోము వీర్రాజు మండిపాటు విమర్శలు

జీవో నెంబరు 39 ద్వారా వైసిపి ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన పారిశ్రామిక విధానం కారణంగా 2020-23లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

ap bjp chief somu veerraju ap new industrial policy
Author
Amaravathi, First Published Aug 25, 2020, 8:41 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జీవో నెంబరు 39 ద్వారా వైసిపి ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన పారిశ్రామిక విధానం కారణంగా 2020-23లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.

ఈ వర్గాలకు గత 2015-20 పారిశ్రామిక విధానంలో వున్న రాయితీలను తీసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీ శాతాన్ని 45 % నుండి 35 % తగ్గించారని.. గతంలో పరిశ్రమ పెట్టిన 6 నెలల్లో సబ్సిడి వచ్చేదని వీర్రాజు మండిపడ్డారు.

ఇపుడు 3సం.ల నుండి 5 సంల వరకు యూనిట్ విజయవంతంగా నడుస్తూ వుంటే సబ్సిడీ ఇస్తారని ఆయన చెప్పారు. గతంలో రూ.75 లక్షలు గరిష్టంగా వున్న సబ్సిడీ రూ. 50 లక్షలకు తగ్గించారని... ప్రస్తుత నూతన పాలసీ ప్రకారం సర్వీస్ సెక్టర్ రంగానికి సబ్సీడి పూర్తిగా ఎత్తేశారని ఆయన విమర్శించారు.

నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవని.. దీని వల్ల కొత్తగా పరిశ్రమలు రావని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు 'ఉద్యోగ కల్పన' అనే అంశానికి అవకాశం లేదని, బ్యాంకులు ముందుకు రావని.. మూడేళ్ల తర్వాత రాయితీలు ఇస్తామన్నా ఆచరణలో ఆరేళ్లవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి మందగిస్తోందని.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ తగ్గుతుందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఎ.పి.ఐ.ఐ.సి పైనా ప్రభావం చూపుతుందని, ప్లాట్లు కొనుగోలు చేసే  ఔత్సాహికులు వెనుకంజ వేస్తారని ఆయన అన్నారు. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది నిరుత్సాహం కలిగిస్తోందని వీర్రాజు అభిప్రాయపడ్డారు.

పెట్టుబడి రాయితీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గతంలో గరిష్టంగా రూ.30 లక్షల రాయితీ ఉండగా ఇప్పుడు దానిని జనరల్ కేటగిరితో కలిపి రూ.20 లక్షల వరకే పరిమితం చేసి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

తీసుకున్న రుణంపై గతంలో పావలా వడ్డీ (3 శాతం) మాత్రమే వసూలుచేయగా ఇప్పుడు దానిని 9 శాతానికి పెంచారన్నారు. జనరల్ కేటగిరికి కరెంటు ఖర్చులో యూనిట్ కు గతంలో ఇచ్చిన రూపాయి రాయితీని మాత్రం అలాగే ఉంచారని వీర్రాజు  స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి రూపాయిన్నర రాయితీని 'రూపాయి పావలా'కు కుదించారని ధ్వజమెత్తారు. ఈ రాయితీలు కూడా పరిశ్రమ వర్గాలు సంవత్సరాల పాటు సమర్ధవంతంగా నిర్వహిస్తేనే అందిస్తామని ప్రభుత్వం నిబంధన విధించిందని ఆయన చెప్పారు.

ఏ పరిశ్రమకైనా  బ్రేక్ ఈవెన్ రావాలంటే రెండేళ్లు పడుతుందని, ఈ రెండేళ్లలో రాయితీలు అందితేనే పరిశ్రమ నిలబడుతుందని వీర్రాజు చెప్పారు. కాబట్టి మూడేళ్ల తరువాత ఇచ్చే రాయితీలు వచ్చినా, రాకపోయినా ఒకటేనని తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' పైనా ఈ పాలసీ ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా పధకాలను ప్రవేశ పెట్టిందని వీర్రాజు తెలిపారు.

ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఇద్దరికీ తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించిందన్నారు. వీరిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ, మరొకరు వర్గాలకు అతీతంగా మహిళకు రూ.10 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ఎలాంటి పూచికత్తు లేని ఋణాలను ఇవ్వాలని పేర్కొంటూ 18 నెలల పాటు మారటోరియం విధించిన విషయాన్ని సోము గుర్తుచేశారు.

గత ప్రభుత్వ పాలసీ కారణంగా ఈ పధకం 25 శాతం మాత్రమే అమలు జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీల ప్రయోజనాల దెబ్బతీస్తూ, పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నూతన పారిశ్రామిక విధానాన్ని, పూర్తిగా ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios