ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.

వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం సుహారిక ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే సుహారిక మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సుహారిక మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఆమె ఆకస్మిక మరణంతో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.