గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఉండేదని అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా ఉంటుందని ఆరోపించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీతో ఎన్నో పనులు చేయించుకున్న వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల భరతం పడతాన్న జగన్ ఎంతమంది అవినీతి పరులను వెలికితీశారో చెప్పాలని నిలదీశారు. 

ఏపీలో మైనింగ్ అక్రమ రవాణా ఏమాత్రం ఆగలేదన్నారు. వ్యక్తులు మాత్రమే మారారని ఇక అంతా మామూలేనని చెప్పుకొచ్చారు. ఇకపోతే పల్నాడులో బీజేపీ నిర్వహించనున్న ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పల్నాడులో బీజేపీ నిర్వహించే ధర్నా రద్దు కాలేదని కేవలం వాయిదా మాత్రమే పడిందన్నారు. పల్నాడులో ప్రస్తుత పరిస్థితులపై డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.