ఏపీ బీజేపీ పదాదికారుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించి అధిష్టానమే మాట్లాడుతుందని, నేతలెవ్వరూ నోరు విప్పొద్దని ఆమె హెచ్చరించారు.
విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ బీజేపీ పదాదికారుల సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఎవ్వరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని ఆమె హెచ్చరించారు. పొత్తులకు సంబంధించి అధిష్టానమే మాట్లాడుతుందని పురందేశ్వరి తెలిపారు. ఇతరుల బలంపై ఆధారపడొద్దని.. సొంత బలంపైనే రాజకీయం వుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇదిలావుండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పురందేశ్వరి త్వరలో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన-బీజేపీ కలిసి కార్యక్రమాలు నిర్వహించే ఛాన్స్ వుంది. అలాగే ఈ నెల ఈ నెల 23 నుంచి పురందేశ్వరి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత రాయలసీమకు చెందిన పార్టీ నేతలతో ఆమె భేటీ కానున్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి గురువారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అయితే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ అని చెప్పారు.
ALso Read: ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి.. జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం..
విభజన బిల్లులో ఉన్న విధంగా ఏపీలో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు ముందు రైతులకు రూ. 12 వేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కలిపే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇళ్లకు సంబంధించి 35 శాతం కూడా పూర్తి కాలేదని విమర్శించారు.
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్‌లో.. ప్రత్యేక హోదాలో జరిగే లబ్దిని పొందుపరచడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఏమిటనేది ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు.
