టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల.. బీజేపీ సంగతేంటీ , మా వ్యూహం మాకుందన్న పురందేశ్వరి
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు బీజేపీపై పడింది . దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. మా వ్యూహం మాకుందన్న పురందేశ్వరి టీడీపీ, జనసేన అన్ని సీట్లను ఇంకా ప్రకటించలేదు కదా అని వ్యాఖ్యానించారు
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించడంతో ఇప్పుడు అందరి చూపు బీజేపీపై పడింది. కూటమిలోకి బీజేపీ చేరుతుందా .. లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా తమతో చేతులు కలిపిన తర్వాత మిగిలిన సీట్లపై ప్రకటన చేస్తామని చంద్రబాబు, పవన్‌లు మీడియాకు వివరించారు. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పొత్తులకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వివరించారు.
మా వ్యూహం మాకుందన్న పురందేశ్వరి టీడీపీ, జనసేన అన్ని సీట్లను ఇంకా ప్రకటించలేదు కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్ కనుక పొత్తు ఖరారు చేస్తే.. అప్పుడు సీట్ల పంపకం గురించి ఆలోచిస్తామని ఆమె వివరించారు. అప్పటి వరకు 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టిసారిస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
మరోవైపు.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై తాను చాలా కృషి చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో జనసేన టీడీపీతో బీజేపీ పొత్తు వుంటుందా , వుండదా అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో చంద్రబాబు, పవన్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీ ఎక్కువ సీట్లు కోరడంతోనే పొత్తు ఖరారు కాలేదనే టాక్ నడుస్తోంది.మరి ఈ సస్పెన్స్ ఇంకెంత కాలం నడుస్తోందో చూడాలి మరి.