అమరావతి: దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని జగన్ హామీ ఇచ్చాడు.ఈ హామీ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది అక్టోబర్  1వ తేదీ నుండి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది ప్రభుత్వం.

రాష్టంలో ఎక్కడా కూడ బెల్ట్ షాపులు ఉండవని ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పింది.  కొత్త పాలసీ ప్రకారంగా ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్లో 800 షాపులను తగ్గించింది. మరో వైపు తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణలు లేకుండా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి మార్గమధ్యలో ఉన్న మద్యం షాపులను ఎత్తివేశారు. ఈ మార్గంలో మద్యం షాపులు ప్రస్తుతం ఉన్నాయి. రానున్న రోజుల్లో మద్యం షాపులు ఇక్కడ ఉండవని ప్రభుత్వం ప్రకటించింది.

అక్టోబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో బ్రేవరేజస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలోనే 3500 మద్యం దుకాణాలను నడపనున్నట్టు ఏపీ ప్రభుత్వం  ప్రకటించింది. ఎన్నికల సమయంలో దశలవారీగా మద్య పానాన్ని నిషేధిస్తామని జగన్  హామీ ఇచ్చాడు.ఈ హామీ మేరకు కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసినట్టుగా అధికారులు ప్రకటించారు.