అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. ఇకపోతే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించారు. 

అనంతరం చంద్రబాబు తరపున మాట్లాడే అవకాశం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడుకు ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ కోరిక మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అచ్చెన్నాయుడుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. 

ఈ సందర్భంగా సబ్జెక్టును మాత్రమే మాట్లాడి త్వరగా పూర్తి చేయాలంటూ అచ్చెన్నాయుడును కోరారు. దీంతో అచ్చెన్న స్పీకర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సబ్జెక్టుకే వస్తున్నానని లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా అంటూ మాట్లాడారు. 

దీంతో ఆగ్రహించిన స్పీకర్ మీరు చెప్పండి నేను చదువుతాను ఇక్కడ అంటూ చెప్పుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా అంటూ స్పీకర్  తీవ్రంగా మండిపడ్డారు.