శ్రీకాకుళం: పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం, వైసీపీ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పోటీ పడి మరీ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. తాజాగా శానససభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వాణి నామినేషన్ వేశారు తొగరాం తమ్మినేని సీతారాం స్వగ్రామం. దీంతో గ్రామంలో పంచాయతీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాణి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. 

కాగా, శ్రీకాకుళం జిల్లాలో తన సతీమణిని సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేయాలనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడి వ్యూహం బెడిసికొట్టింది. అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవికి ఆయన సతీమణి నామినేషన్ వేశారు. అయితే, అప్పన్న అనే స్థానిక నేత వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. 

తన సతీమణిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు ప్రత్యర్థి వర్గంపై దాడి చేశారనే ఆరోపణపై పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో అప్పన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.