శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తన సొంత జిల్లాలో పర్యటిస్తున్న తమ్మినేని సీతారాం సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలి అంటూ వ్యాఖ్యానించారు. 

సామాజిక న్యాయంతో చట్టాలు చేసిన దమ్ము సీఎం జగన్ కు ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటీషన్లు వేసినా భయపడొద్దని సూచించారు. ఆగష్టు 18 తర్వాత గ్రామాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పర్యటిస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. 

గ్రామవాలంటీర్ల వ్యవస్థ, పనితీరును ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తారంటూ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో ఆయా వాలంటీర్లకు తగు సూచనలు, సలహాలు ఇస్తారని తెలిపారు. గ్రామవాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా గ్రామవాలంటీర్లు పనిచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.