హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటన రాజభవన్ కు చేరుకుంది. ఏప్రిల్ 11న సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద జరిగిన దాడి ఘటనపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చెయ్యనున్నారు కోడెల శివప్రసాదరావు. 

ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని కోడెలతోపాటు తెలుగుదేశం పార్టీ సైతం ఆరోపిస్తుంది. అటు కోడెలపై తాము దాడి చెయ్యలేదని ఆయనే చొక్కాలు చింపుకుని సానుభూతి పొందాలని ప్రయత్నించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చెయ్యనున్నారు. ఏప్రిల్ 11న ఇనిమెట్ల పోలింగ్ బూత్ వద్ద తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన ఫిర్యాదు చెయ్యనున్నట్లు తెలుస్తోంది. 

అందుకు సంబంధించి వీడియోలను సైతం అందజేయనున్నట్లు సమాచారం. అలాగే దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అనుసరించిన తీరు, ఇటీవలే రాజుపాలెం పీఎస్ లో తనపై నమోదు చేసిన కేసు వంటి వ్యవహారాలపై చర్చించనున్నట్లు సమాచారం.