వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి సీఎం జగన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఉదయం లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చీఫ్ విప్ ప్రసాదరాజు.. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టుగా చెప్పారు.
అయితే రేపు (బుధవారం) సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్, జమిలీ ఎన్నికలకు కేంద్రం కసరత్తు వేళ.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.
ఇక, ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం జగన్ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్దమైన నేపథ్యంలో ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని.. కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఈ సంకేతాలు ఇచ్చే చాన్స్ ఉందనే ప్రచారం సాగుతుంది.