అమరావతి:ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి సమావేశమై లోతుగా చర్చించాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఎస్ఈసీకి నోటీసులు ఇవ్వాలని పలువురు సభ్యులు ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే వారం రోజుల తర్వాత మరోసారి భేటీ కావాలని  ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. 

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని పరిశీలించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రివిలేజ్ కమిటీకి ఈ నెల 01వ తేదీన సిఫారసు చేశారు.

ఈ ఫిర్యాదులపై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ సమావేశమై చర్చించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఎస్ఈసీపై మంత్రుల ఫిర్యాదులను కమిటీ పరిగణనలోకి తీసుకొంది.మంత్రుల ఫిర్యాదుల్లోని అంశాలపై చర్చించింది సమావేశం.

also read:నిమ్మగడ్డపై మంత్రుల ఫిర్యాదు: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ

ఎస్ఈసీకి నోటీసులు ఇవ్వాలని పలువురు సభ్యులు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఈ ఫిర్యాదులపై తదుపరి భేటీలో మరింతగా చర్చించాలని నిర్ణయం తీసుకొన్నారు. తదుపరి భేటీలో ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అసెంబ్లీలోని రూల్ నెంబర్ 212, 213 కింద ఎస్ఈసీని పిలిపించవచ్చని కొందరు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని గుర్తు చేశారు. 

ఆర్టికల్ 243 ప్రకారంగా ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు. అలాంటి ఎస్ఈసీని ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి ఎలా పిలిపిస్తారని ఆయన ప్రశ్నించారు.