కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కోట లాంటిది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు వచ్చినా కడప జిల్లాలో మాత్రం వైఎస్ చెప్పిన వారికే ఓటు.. సుమారు మూడు దశాబ్ధాల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

ముఖ్యంగా వైఎస్ ప్రాతినిధ్యం వహించే పులివెందులలో 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానిదే హవా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినా.. ఆయన కుమారుడు జగన్‌ని అక్కడి ప్రజలు ఆదరించారు. 2019 ఎన్నికల్లో కూడా ఆ సీటు జగన్‌దేనని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.

మరి ఓటమి అని తెలిసినా జగన్‌పై పోటీకి ఎవరు దిగబోతున్నారని సహజంగా ఉత్కంఠ ఉంటుంది. దీనికి తెరదించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో పలుమార్లు వైఎస్ కుటుంబంతో పోటీకి నిలిచిన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీశ్ రెడ్డికే ఈసారి కూడా బాబు అవకాశమిచ్చినట్లుగా తెలుస్తోంది.

గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డిపై సతీశ్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీపడ్డారు. సుమారు 20 ఏళ్లుగా సతీశ్ రెడ్డే పులివెందులలో టీడీపీ అభ్యర్థి...పోటీ చేసిన ప్రతిసారీ ఆయన ఓటమి పాలవుతూనే ఉన్నా.. పట్టువదలకుండా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఈసారైనా పులివెందుల ప్రజలు సతీశ్ రెడ్డికి జైకొడతారేమో చూడాలి.