ANR District: ఆంధ్రప్రదేశ్ లో ఏఎన్నార్ పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలంటూ సరికొత్త డిమాండ్ తెర మీదికి వచ్చింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి కోరికను ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లింది అక్కినేని అభిమాన సంఘం.
ANR District: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ సాగుతుంది. జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో కొత్తగా 13 జిల్లాలు సరికొత్త రూపాన్ని సంతరించున్నాయి. ఈ కొత్త జిల్లాలతో మొత్తం 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడనున్నది.
ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు పై వివాదాలు తలెత్తున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అలాగే.. జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వస్తున్నాయి. పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా వంటి పేర్లను రాష్ట ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు వంగవీటి రాధ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా.. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. తమ జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.
నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా.. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి కోరికను ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లింది అక్కినేని అభిమాన సంఘం. అక్కినేని నాగేశ్వరరావు.. స్వగ్రామం గుడివాడ సమీపంలోని రామాపురం. ఆయన తెలుగు చిత్ర సీమకు ఎన్నలేని కృషి చేశారు. చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారు.
ఆయన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు. విద్యా, సామాజిక సేవల్లోనూ ఆయన ఎంతో తోడ్పాటు అందించారని అభిమానులు గుర్తు చేసుకున్నారు. అలాంటి నటదిగ్గజం పేరును జిల్లాకు పెట్టడం ద్వారా ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
