చంద్రబాబుకు మరో షాక్.. మరో కేసులో అరెస్ట్ కోసం పీటీ వారెంట్ సీఐడీ..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. మరో కేసులో కూడా ఆయనపై పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. మరో కేసులో కూడా ఆయనపై పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించిన కేసులో చంద్రబాబును విచారించేందుకు అనుమతి కోరుతూ సీఐడీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరనున్నట్టుగా తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది.
అటూ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు, ఇటూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా చంద్రబాబును విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ, మరికొందరిపై సీఐడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు.
ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా ఏసీబీ కోర్టును కోరారు. అయితే హౌస్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు.