న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ బీజేపీలో చేరిపోయారు. శుక్రవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అన్నం సతీష్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

అన్నం సతీష్ బీజేపీలో చేరడంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం అన్నం సతీష్ ను బీజేపీలోకి చేరాలంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం పార్లమెంట్ లో  కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

ఇటీవలే అన్నం సతీష్ తన ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏపార్టీలో చేరతారంటూ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అయితే తనకు రాజకీయ గురువులా వ్యహరించిన సుజనా చౌదరి బాటలోనే పయనించాలని అన్నం సతీష్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. 

సుజనాచౌదరి బీజేపీలో చేరడంతో ఆయన వెన్నంటి ఉండాలని అన్నం సతీష్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన పదవిని సైతం వదులుకున్నారు. ఇకపోతే 2014 ఎన్నికల్లో అన్నం సతీష్ బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్టథి కోన రఘుపతి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.