ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఏపీ, ఒడిషా వైపు దూసుకొస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అమరావతి: ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 10వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి)తెలిపింది. ఈ అల్పపీడనం 4-5 రోజుల్లో మరింత బలపడి దక్షిణ ఒడిషా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో ఒడిషాతో పాటు ఏపీలోని తీరప్రాంతాల్లో భయాందోళన మొదలయ్యింది.
ఇక ఇప్పటికే తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయని తెలిపారు. రానున్న 2 రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు తెలుగురాష్ట్రాల్లో ముంచెత్తాయి. ఈ వర్షాల దాటిక ఏపీతో పాటు తెలంగాణలో పలుప్రాంతాలు నీటమునిగాయి. వరదనీటితో తెలంగాణలోని వాగులు వంకలు, నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించారు. జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. వరదనీరు రోడ్లపైకి చేరడం, నివాసాలు మునిగిపోవడం వల్ల, ఉదృతమైన నీటి ప్రవాహాలను దాటడానికి ప్రయత్నించి పలువురు ప్రమాదాలకు గురయ్యారు.
ఇక ఈ భారీ వర్షాలు కారణంగా అన్నదాతలు నష్టపోయారు. వరి పంట నీటమునగడం, పత్తి చేతికందివచ్చే సమయంలో వర్షాలు కురవడంతో ఆయా పంటలు వేసిన రైతులు నష్టపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఇతర పంటలను కూడా నీటిపాలు చేసాయి.
ఈ cyclone gulab ప్రభావంతో కురిసిన వర్ష భీభత్సాన్ని మరిచిపోకముందే మరో తుఫాను హెచ్చరిక వెలువడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గులాబ్ లాగే తాజాగా ఏర్పడిన అల్పపీడనం కూడా ఒడిషా, ఏపీవైపు దూసుకొస్తూ తుఫానుగా మారే అవకాశముందన్న హెచ్చరిక ఈ భయాందోళనకు కారణమయ్యింది.
