Asianet News TeluguAsianet News Telugu

11.43 గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్: అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్


చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో కంటే తమ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయవద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడన్నారు.

Andhra Pradesh tops with 11.43  growth rate  in India : Ys Jagan in AP Assembly
Author
First Published Sep 19, 2022, 3:06 PM IST

అమరావతి:11. 43 గ్రోత్ రేట్ తో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు పారిశ్రామిక ప్రగతిపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.  బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం దేశంలోని 17 రాష్ట్రాలు పోటీపడినట్టుగా సీఎం జగన్ చెప్పారు. కానీ బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటును వ్యతిరేకిస్తూ  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, శాసనసమండలిలో విపక్షనేత  యనమల రామకృష్ణుడులు  కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశారని జగన్ విమర్శించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.   తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తమ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ ను ఎందుకు మంజూరు చేయడం లేదని  కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకానుందన్నారు. దీనితో సుమారు 33 వేల మందికి పైగా ఉపాధి దొరుకుతందని సీఎం వివరించారు. బల్క్ డ్రగ్ పార్క్ తో ఎలాంటి కాలుష్యం ఉండదని సీఎం తేల్చి చెప్పారు. 

గత మూడేళ్ల కాలంలో 99 భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయని సీఎం చెప్పారు.  భారీ పరిశ్రమల ద్వారా రూ. 46, 3280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వివరించారు. ఈ పరిశ్రమల ద్వారా 62 వేల 541 మందికి ఉపాధి లభించిందని సీఎం తెలిపారు.  మరో  40వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని సీఎం ప్రకటించారు.ఎంఎస్ఎంఈల ద్వారా రూ.9,742 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.  వీటి ద్వారా 2 లక్షల మందికి ఉపాధి దొరికిందని సీఎం వివరించారు. ఇంకా రూ. 91 వేల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరగుతున్నాయని జగన్ చెప్పారు. ఈ మూడేళ్లలో సగటున రూ, 12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో సగటున రూ. 11, 994 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టుగా సీఎం జగన్ వివరించారు. వరుసగా మూడు ఏళ్లుగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని జగన్ విమర్శించారు. థావోస్ కు వెళ్లి చంద్రబాబునాయుడు తెచ్చిన పెట్టుబడుల కంటే తమ పాలనలో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామిక రంగాన్ని చంద్రబాబునాయుడు నిర్వీర్యం చేశారన్నారు. గతంలో కంటే తమ ప్రభుత్వ హయంలో పారిశ్రామిక అభివృద్ది ఎక్కువగా సాగుతుందని ఆయన చెప్పారు. 

also read:వాయిదా తీర్మానంపై పట్టు: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

గతంలో రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని ఏపీ సీఎం జగన్ చెప్పారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏం చేయగలమో అదే చెబుతున్నాం, అదే చేస్తున్నామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios