విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మరణించారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కారులో ఆస్పత్రికి తరలించారు. అయితే, మధ్యలోనే ఆయన మరణించారు. 

కరోనా వైరస్ కారణంగా మరణించిన ఉంటారనే అనుమానంతో బంధువులు కూడా దగ్గరకు వెళ్లడానికి జంకుతున్నారు. స్థానికంగా కాంగ్రెసు పార్టీకి అండదండలు అందించిన నేత ఆదిరాజు. జిల్లాలో కాంగ్రెసు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన స్థితిలో పార్టీ కార్యాలయం తెరిచిన మొదటి నేత ఆయన.

జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసి, జిల్లాలో కాంగ్రెసు పార్టీకి తిరిగి జీవం పోసే ప్రయత్నం చేశారు. చురుకైన నేతగా ఆయన మెప్పు పొందారు. వివిధ ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేశారు. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు గతంలో ఆయన వీరవిధేయుడిగా ఉండేవారు.