Asianet News TeluguAsianet News Telugu

టీకా ఉత్సవం : ప్రధాని మోదీకి జగన్‌ లేఖ.. ఏపీకి 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు...

‘టీకా ఉత్సవం’ కోసం వెంటనే 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు పంపించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

andhra pradesh needs 25 lakh doses of COVID-19 vaccine for tika utsav, ys Jagan writes to modi - bsb
Author
Hyderabad, First Published Apr 10, 2021, 11:16 AM IST

‘టీకా ఉత్సవం’ కోసం వెంటనే 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు పంపించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన వాక్సిన్ డోసుల మీద ప్రధానికి లేఖ రాశారు జగన్. ఆ లేఖలోని అంశాలు :

కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వాక్సినేషన్‌కు సంబంధించి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు సంబంధించి టెస్ట్, ట్రాక్, ట్రేస్‌ నిర్దిష్ట పద్ధతిలో జరగాలన్న మీ సూచనలను రాష్ట్రంలో పక్కాగా అనుసరిస్తున్నాము. రాష్ట్రంలో కూడా కోవిడ్‌ నివారణ చర్యల్లో మీరు అందించిన సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కోవిడ్‌ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు, వాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అమలు చేస్తున్నాము. ఆ దిశలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవం’ నిర్వహించాలన్న మీ నిర్దేశం ఈ ప్రక్రియలో ఎంతో ఉపయోగకరం కానుంది. 

సమాజంలోని అన్ని వర్గాల వారు వాక్సిన్‌ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో టీకా ఉత్సవం స్ఫూర్తి దాయకం కానుంది.
    
రాష్ట్రంలో టీకా ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో టీకా ఉత్సవం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాము. వాక్సిన్‌ అవసరమైన వారిలో ఒక్కరిని కూడా విడిచి పెట్టకుండా పెద్ద ఎత్తున వైద్యులు, ఏఎన్‌ఎంలను వినియోగించడం జరుగుతుంది.

రాష్ట్రంలో ప్రత్యేకంగా వలంటీర్‌ వ్యవస్థ ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించడం జరిగింది. వారు తమ పరిధిలోని ఇళ్లలో వాక్సిన్‌ వేయాల్సిన వారిని గుర్తిస్తారు. టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 1140 పీహెచ్‌సీలు, 259 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ) పరిధిలోని 1145 గ్రామాలు, 259 వార్డులలో వాక్సిన్‌ వేయడం జరుగుతుంది. ఆ విధంగా నాలుగు రోజుల్లో మొత్తం 4580 గ్రామాలు, 1036 అర్బన్‌ వార్డులలో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. తద్వారా ఒక పండగ వాతావరణంలో వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 6 లక్షల మంది (4 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షలు పట్టణ ప్రాంతాల్లో) వాక్సిన్‌ ఇచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేశాము. ఆ విధంగా నాలుగు రోజుల టీకా ఉత్సవంలో మొత్తం 24 లక్షల మందికి వాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుంది. 

అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం అందుకు తగిన సంఖ్యలో వాక్సిన్‌ కావాలి. కాగా, రాష్ట్రంలో ప్రసుత్తం  కేవలం 2 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు మాత్రమే ఉండగా, మరో రెండు లక్షల డోస్‌లు  వచ్చే వీలుంది. అందువల్ల రాష్ట్రానికి అత్యవసరంగా మరో 25 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌ల అవసరం ఉంది. 

అవి కూడా ఈనెల 11వ తేదీ నాటికి అందిస్తే, ఈ కార్యక్రమాన్ని దేశమంతా గుర్తించే విధంగా నిర్వహిస్తాము. అందువల్ల తక్షణమే రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు పంపేలా ఆరోగ్య శాఖను ఆదేశించాలని కోరుతున్నాను. 

కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తిగా సహకరిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాను. అంటూ లేఖలో అన్ని విషయాలూ ప్రస్తావించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios