అంతుచిక్కని వ్యాధితో విలవిలలాడుతున్న ఏలూరు పరిస్థితి మీద ఏపీ సర్కార్ డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని కోరింది. దీనిమీద అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని కోరింది. 

రేపో, మాపో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి బృందాలు ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్ఐఎన్ సంస్థలు దీనికి కారణం ఏమై ఉంటుందా అని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

అంతుచిక్కని వ్యాధితో ఏలూరు పట్టణం విలవిలలాడుతోంది. విశాఖ గ్యాస్‌ లీకేజీ దృశ్యాలే ఏలూరులోనూ కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగిపోతుండడం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలబడటంలాంటి సంఘటనలు ఏలూరులో ఏప్రాంతంలో చూసిన అవే అవే దృశ్యాలు కనిపించాయి. 

మోటారుసైకిల్‌ను నడుపుతున్నప్పుడు ఓ యువకుడు పడిపోయాడు. ఓ వివాహిత ఇంట్లోనే అందరితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి కొద్దిసేపు అపస్మారకంలోకి చేరుకుంది. ఆరేళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి దేవాలయానికి వెళ్లగా అక్కడే స్పృహ తప్పి కుప్పకూలింది. మరో వ్యక్తి ఇంట్లోనే ఎవరూ లేనందున వంట చేస్తూ స్టవ్‌ వద్ద కళ్లు తిరిగిపడిపోయాడు. 

ఇంకో వృద్ధురాలు కూడా వంట చేస్తున్నప్పుడు స్పృహ తప్పింది. ఒకే కుటుంబంలో నలుగురైదుగురు ఉంటే ఒకరు, పలుచోట్ల ఇద్దరు ఈ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులకు చేరుతున్నారు. ఏ జరిగిందో తెలుసుకునే లోపే ఆస్పత్రిలో ఉంటున్నారు.