ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వైఎస్సార్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది.
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
