టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు జనాలు రావడానికి భయపడుతున్నారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరికొన్నిరోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ మంత్రులు, కీలక నేతలు భేటీ అయ్యారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. నారా లోకేష్ పాదయాత్రకు రావడానికి భయపడుతున్నారనీ విమర్శించారు. ఆయన పాదయాత్రలో కనీసం పది మంది కూడా లేరని, లోకేష్ యాత్ర .. ఓ విఫల యాత్ర అని అన్నారు.
అదేసమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆహ్వానించడంపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని, ఓ వేళ జూనియర్ ఎన్టీఆర్ .. పార్టీలోకి వస్తే.. నారా బతకుదెరువు లేదని ఏద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర విఫలమైన నేపథ్యంలో వారాహితో పవన్ కల్యాణ్ నిర్వహించే యాత్రకు ఎక్కడ ప్రజాదారణ ఎక్కవ వస్తుందోనని భయపడుతున్నారని అన్నారు. అందుకే ..నారా కుటుంబం పవన్ కల్యాణ్ పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా ఆరోపించారు.
వాస్తవానికి లోకేశ్ పాదయాత్రకు జనాలే లేరని, టీడీపీకి చిత్తూరులో ఒక్క ఇన్చార్జిలు కూడా లేరని ఎద్దేవా చేశారు. లోకేశ్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబా అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబం గుర్తుకు రాలేదనీ, కష్ట కాలంలో నేడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. లోకేశ్ కు దమ్ముంటే చిత్తూరులో పోటీ చేసి గెలువాలని రోజా సవాల్ విసిరారు.
