ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఐఏఎస్ అధికారికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి ఎం హరి నారాయణకు (M Hari Narayana) మూడు నెలల సాధారాణ జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో ఐఏఎస్ అధికారికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మాజీ కమిషనర్ ఎం హరి నారాయణకు (M Hari Narayana) మూడు నెలల సాధారాణ జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే హరినారాయణ తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు హైకోర్టు.. ఆయనకు విధించిన శిక్షను ఆరు వారాలపాటు సస్పెండ్ చేసింది.
ఆయన అప్పీలు దాఖలు చేయడంలో విఫలమైన, అప్పీలుపై కోర్టు స్టే విధించకపోయిన 2022 జూన్ 16 సాయంత్రం 5 గంటల్లోగా రిజిస్ట్రార్ (జ్యూడిషియల్) ముందు సరెండర్ కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో గంట్యాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే పి శ్రీనివాస్‌లపై ఉన్న కోర్టు ధిక్కరణ చర్యలను Andhra Pradesh High Court కొట్టివేసింది.
అసలు కేసు ఏమిటి..
వీధి వ్యాపారుల చట్టం కింద గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ తమ దుకాణాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ 2017లో వైజాగ్‌లోని హాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే చట్ట ప్రకారం నడుచుకోవాలని, వీధి వ్యాపారులకు చెందిన వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని జీవీఎంసీని కోర్టు ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పు అనంతరం జీవీఎంసీ అధికారులు మున్సిపల్ చట్టం కింద నోటీసులు జారీ చేసి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించారు. దీంతో అప్పటి జీవీఎంసీ కమిషనర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎమ్మెల్యేలపై హాకర్స్ అసోసియేషన్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఈ కోర్టు ధిక్కార పిటిషన్ జస్టిస్ బి దేవానంద్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చిన సమయంలో.. వీధి వ్యాపారులు రోడ్లను ఆక్రమించారని, జీవీఎంపీ నిబంధనలను అనుసరించి వారి దుకాణాలను తొలగించిందని హరినారాయణ కోర్టుకు తెలియజేశారు.
ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. వీధి వ్యాపారుల చట్టం ప్రకారం దుకాణాలను తొలగించేందుకు 30 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ పిటిషనర్ల షాపులను తొలగించేందుకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పేర్కొంది. పిటిషనర్ల ఆక్రమణలను తొలగించే సమయంలో అధికారులు కఠినంగా వ్యవహరించారని కోర్టు అభిప్రాయపడింది.
