ఓ ఖైదీని కలిసేందుకు ఇంత దుబారా ఖర్చు అవసరమా జగన్..!: హోంమంత్రి అనిత

వైసిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ నెల్లూరు జైలుకు వెళ్ళారు... అయితే తాడేపల్లి నుండి నెల్లూరు వెళ్లేందుకు ఆయన ఎంత ఖర్చు చేసారట తెలుసా.?

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha  serious on YS Jagan AKP

Vangalapudi Anitha : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుబారా చేసారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా వేదిక కూల్చివేత నుండి రుషికొండ భవనాల వరకు ఇష్టారీతిన ప్రజల డబ్బు ఖర్చు చేసారంటూ విమర్శిస్తున్నారు. అయితే అధికారం పోయినా జగన్ దుబారా ఖర్చులు తగ్గడంలేదట... కేవలం తాడేపల్లి నుండి నెల్లూరు జైలుకు వెళ్లడానికే ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసారట. తప్పు చేసి జైలుకు వెళ్లిన వ్యక్తిని కలవడానికి ఇంత ఖర్చు చేసారంటూ వైఎస్ జగన్ కు హోంమంత్రి అనిత చురకలు అంటించారు. 

పిన్నెల్లికి జగన్ పరామర్శపై హోంమంత్రి ఏమన్నారంటే..: 

ఎన్నికల సమయంలో అలజడి సృష్టించి పోలింగ్ బూత్ లోకి వెళ్లిమరీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎం ధ్వంసం చేసారని హోంమంత్రి అనిత తెలిపారు. దీన్ని అడ్డుకోడానికి ప్రయత్నించినవారిపై దాడులకు తెగబడినందుకు హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా ఈవిఎంల ధ్వసం, హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న ఆయనను అరెస్ట్ చేయమని కోర్టులే చెప్పాయని హోంమంత్రి గుర్తుచేసారు. ఇందులో జగన్ ఆరోపిస్తున్నట్లు కక్ష సాధింపు ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. 

అయినా అధికారాన్ని కోల్పోయిన తర్వాత తప్పుచేసి జైలుకెళ్లిన ఓ ఖైదీని కలవడమే వైఎస్ జగన్ మొదటి కార్యక్రమంగాపెట్టుకున్నారని అన్నారు. ఆయనను పరామర్శించేందుకు తాడేపల్లి నుండి నెల్లూరుకు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారని... ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చయినట్లు తెలిపారు. ఇలా ఓ ఖైదీని కలిసేందుకు ఇంత ఖర్చు అవసరమా అనేలా వైఎస్ జగన్ కు చురకలు అంటించారు హోంమంత్రి అనిత. 

అసలు నెల్లూరులో అలజడి సృష్టించేందుకే జగన్ పర్యటించారనేలా హోంమంత్రి మాట్లాడారు. ఇప్పటికే జైల్లోని పిన్నెల్లికి ములాఖత్ అవకాశాలు పూర్తయ్యాయి... ఈ విషయం తెలిసే జగన్ వచ్చారని అన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ములాఖత్ కోరడంతో మానవతా దృక్ఫధంతో అనుమతించామని తెలిపారు. ఒకవేళ పిన్నెల్లిని కలిసే అవకాశం అవకాశం జగన్ కు ఇవ్వకుంటే వైసిపి వాళ్లు హంగామా చేసేవారని... ఇదే వాళ్ల ప్లాన్ అనేలా హోంమంత్రి కామెంట్ చేసారు. 

 గతంలో వైసిపి ప్రభుత్వ వ్యవహార తీరును ఈ సందర్భంగా అనిత గుర్తుచేసారు. మాజీ సీఎం చంద్రబాబును జైల్లో పెట్టి కుటుంబసభ్యులకు కూడా ములాఖత్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. కానీ ఇలాంటి పనులు తాము చేయడంలేదు... నిబంధనలకు లోబడి మానవత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు.  నిజంగానే కక్ష తీర్చుకోవాలని అనుకుంటే పరిస్థితి మరోలా వుండేదని హోంమంత్రి అనిత అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios