Asianet News TeluguAsianet News Telugu

రాజధాని ఫైల్స్ కు లైన్ క్లియర్ ...  విడుదలకు ఓకే చెప్పిన ఏపి హైకోర్టు 

అమరావతి రైతులు, మహిళల రాజధాని ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ మూవీని ఏపీలో ప్రదర్శించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

Andhra Pradesh High Court lifted stay on Rajadhani files movie release AKP
Author
First Published Feb 16, 2024, 12:39 PM IST

అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ ప్రజలపై సినిమాల ప్రభావం ఎక్కువగా వుంటుంది... ఇది గ్రహించిన ప్రధాన పార్టీలు ఈ సినిమాలనే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన 'రాజధాని ఫైల్స్' మూవీ రిలీజ్ పై ఏపీలో వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. నిన్న(గురువారం) విడుదలైన ఈ మూవీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రదర్శింపబడలేదు. ఈ సినిమాపై వైసిపి నాయకులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఏపీలో విడుదలను అడ్డుకుంటూ హైకోర్టు స్టే విధించింది.  

అయితే తాజాగా రాజధాని ఫైల్స్ మూవీని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రదర్శించేందుకు హైకోర్టు అనుమతించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని మూవీ యూనిట్ కు సూచించామని... తాము చెప్పినట్లే చేసారని సెన్సార్ బోర్డ్ కోర్టుకు తెలిపింది. కాబట్టి సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ కోరగా అందుకు హైకోర్టు అంగీకరించింది. రాజధాని ఫైల్ సినిమాపై విధించిన స్టే ఎత్తివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం ఆధారంగా 'రాజధాని ఫైల్స్' మూవీ తెరకెక్కింది. వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత నాలుగైదేళ్లుగా అమరావతి ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే ఈ అమరవతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసిపి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని... రైతులు, మహిళలపై దాష్టికానికి పాల్పడినట్లు ఆరోపణలున్నారు. ఇలా వైసిపి ప్రభుత్వం అమరావతి రైతులతో వ్యవహరించి తీరు... రాజధాని కోసం జరుపుతున్న పోరాటాన్ని ఈ రాజధాని ఫైల్స్ సినిమాలో చూపించారు.  

Also Read  Raajadhani Files : ‘ముగ్గురు అమ్మలు.. ముగ్గురు నాన్నలు’ అంటూ... మూడు రాజధానులపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికల వేళ వైసిపిని దెబ్బతీసేలా రాజధాని ఫైల్స్ మూవీ వుడటంతో ఆ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వుందని... అందువల్ల విడుదలను ఆపాలని వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసారు,     ఇప్పటికే సెన్సార్ బోర్డ్ జారీచేసిన దృవపత్రాన్ని రద్దు చేసి సినిమా విడుదలను ఆపాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో ఏపీలో సినిమా ప్రదర్శన ఆగిపోయింది... మిగతా చోట్ల యదావిధిగా విడుదలైంది. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఏపీలోనూ రాజధాని ఫైల్స్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios