Asianet News TeluguAsianet News Telugu

పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం: షెడ్యూల్ ఇదీ...

పదవ తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జులై 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పేపర్లను 11 నుంచి ఆరుకు కుదించింది.

Andhra Pradesh Govt releases SSC exmas schedule
Author
Amaravathi, First Published May 14, 2020, 5:57 PM IST

అమరావతి:  పదవ తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు పేపర్ల పరీక్షలు ఆరు రోజులు జరుగుతాయి.

ఒక్కో పేపర్ కు వంద మార్కులు ఉంటాయి. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్షల షెడ్యూల్ ఈ కింది విధంగా ఉంది.

జులై 10వ తేదీన ఫస్ట్ లాంగ్వెజ్
జులై 11ల తేదీన సెకండ్ లాంగ్వెజ్
జులై 12వ తేదీన ఇంగ్లీష్
జులై 13వ తేదీన మాథమెటిక్స్
జులై 14వ తేదీన జనరల్ సైన్స్
జులై 15వ తేదీన సోషల్ సైన్స్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2 వేల మార్కు దాటింది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలో ఏపీలో కొత్తగా  36 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరుకుంది. 

తాజాగా మరో మరణం సంభవించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 48కి చేరుకుంది. ఇప్పటి వరకు 1192 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 860 ఉంది. 

గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 5 కేసులు రికార్డయ్యాయి. కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండేసి కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ 591 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 404 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లా 351 కేసులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

కరోనా వైరస్ తో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 18 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో 14 మంది, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు మరణించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios