విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం గ్యాస్ లీకేజ్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. బుధవారం అర్థరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దీనితో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు లేని పరిశ్రమలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఓ రిపోర్టు సిద్ధం చేయగా.. దాదాపు 86 పరిశ్రమలు ఉన్నట్లు తేలింది.  వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉండవచ్చునని ప్రభుత్వం ప్రాధమిక అంచనాకు వచ్చింది.

 దీంతో వెంటనే ఆ 86 పరిశ్రమలపై చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఈ పరిశ్రమలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెళ్లి తనిఖీ చేసి.. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు. లేని పక్షంలో మొత్తం అన్నింటిని సీజ్ చేయనున్నారు. 

కాగా, పరిశ్రమల భద్రతా ప్రమాణాలను పరిశీలించి రెండు రోజుల్లో పూర్తి నివేదికను నివేదికను పంపాలని పరిశ్రమల శాఖ… ఆయా జిల్లాల్లో అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.