తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి గతేడాది సుప్రీం కోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పాటించకపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందిచాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అకాడమీ విభజనకు సంబంధించి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అయింది. విభజనలో జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఏపీ సర్కార్.. సుప్రీం కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుంది. కోర్టు ఆదేశాలిచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై సీరియస్‌గా స్పందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయనుంది.
ఇక, తెలుగు అకాడమీ విభజన పూర్తి చేయాలని గతేడాది సెప్టెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను విత్ డ్రా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రూ. 65 కోట్ల నిధుల గల్లంతు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో తెలుగు అకాడమీ విభజన ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. ఏపీ సర్కార్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక, గతంలో తెలుగు అకాడమీ విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
