అమరావతి: రాష్ట్ర పరిపాలనలో కొత్త ఒరవడి ఆరంభమైందని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా 'ఆంధ్రప్రదేశ్ తో - ఐఎస్‌బీ' లు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని... ఇందులో భాగంగానే 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్‌బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్' కు శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్ లో వెనుకబడిన ప్రాంతాలే లేని సమానాభివృద్ధికై సీఎం తపిస్తున్నారన్నారు. 

ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందని...ఆర్థిక, పారిశ్రామిక, నైపుణ్య, ఐ.టీ, ఉపాధి  రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అధ్యయనం, విజ్ఞానం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచనలు చేస్తోందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్‌బీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. 

విశాఖ పట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థికవనరుగా మార్చే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి తెలిపారు. సత్వరమే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 

'సంగం' సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలి... మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

మంత్రి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒప్పంద పత్రాలపై పరిశ్రమల శాఖ కమిషనర్, ఈడీబీ, సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేశారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్‌బీ' అవగాహన ఒప్పంద కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి,  విద్యాసాగర్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు. 

ఇక ఐఎస్‌బీ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భగవాన్ చౌదరి, భర్టీ ఇన్ స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ  డిజిటల్ ఐడెంటిటి రీసెర్చ్ ఇన్షియేటివ్ విభాగం, ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, క్లినికల్ ప్రొఫెసర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ప్రొఫెసర్ దీప మణి, శ్రీని రాజు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్ వర్క్డ్ ఎకానమీ, ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు తదితరులు  పాల్గొన్నారు.