కరోనాతో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు: జగన్ సర్కార్ నిర్ణయం
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు ఏపీ సర్కార్ రూ. 10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొంది.
అమరావతి: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు ఏపీ సర్కార్ రూ. 10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడు కరోనాపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులో కనీసం 20 వేల కేసులు నమోదౌతున్నాయి. దీంతో తల్లిదండ్రులను కోల్పొయిన అనాథలైన పిల్లలను ఆదుకోవాలని ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులు చనిపోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు ఆ పిల్లల పేరున రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో పిల్లలు జీవించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించారు. కర్ఫ్యూను పొడిగింపు కారణంగా కరోనా కేసులు సంఖ్య తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ మరింత వేగవంతం చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.