కరోనా ఎఫెక్ట్: మే 5 నుండి ఏపీలో పగటిపూట సైతం కర్ఫ్యూ
: రాష్ట్రంలో కరోనా ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 5వ తేదీ నుండి పగటిపూట కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
అమరావతి: రాష్ట్రంలో కరోనా ను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 5వ తేదీ నుండి పగటిపూట కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనాపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రెండు వారాల పాటు పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తారు.
ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకొనేందుకు అనుమతిని ఇచ్చారు. అయితే 12 గంటల వరకు కూడ ఆంక్షలు ఉంటాయి. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఒకే చోట ఐదుగురు గుంపులుగా ఉండకూడదు. ఒకవేళ అలా గుంపుగా ఉంటే కఠిన చర్యలు తీసుకొంటారు. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాడు ఒక్కరోజే 20 వేలు దాటాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పగటిపూట కూడ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పగటిపూట కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపును ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో పాటు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.