ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా వివరించారు.

‘‘ అమరావతి కీర్తి పతాకలో మరో కలికితురాయి.. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుదిశలా చాటిన నందమూరి తారక రామారావుకి ఘన నివాళిగా ఎన్టీఆర్ మెమోరియల్’’ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్ లో ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా  ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

నీరుకొండపై 32మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60మీటర్ల ఎత్తులో ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విగ్రహం చుట్టూ మొత్తం 200 ఎకరాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.406కోట్లు ఖర్చు చేయనున్నారు.

ప్రత్యేక ట్రస్ట్ ద్వారా నిధులు సేకరించి.. వాటి ద్వారా ఈ మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 14ఎకరాల భూమి కేటాయిస్తున్నారు. నీరుకొండ చుట్టూ 70-80ఎకరాల్లో జలాశయ నిర్మాణం చేపట్టనున్నారు. మెమోరియల్ మొత్తాన్ని రూ.406కోట్లు ఖర్చు పెడుతుండగా.. కేవలం విగ్రహ నిర్మాణానికి రూ.155కోట్ల కేటాయిస్తున్నారు. ఇక్కడ రెస్టారెంట్లు, సెల్ఫీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు.