ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జండావందనం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జండావందనం చేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు.
శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, త్యాగధనుల ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి పరిపాలన సాగుతుందని తెలిపారు. ఈ వేడుకలలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. నేటినుంచి అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టారు.
‘‘ న్యాయస్థానం టు దేవస్థానం ’’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మహా పాదయాత్ర నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు జరగనుంది. దీనికి శనివారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి అనుమతి లభించింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కొన్ని షరతులు విధించారు.
షరతులు ఇవే:
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే యాత్ర కొనసాగించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొనేవారు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు.
పాదయాత్ర సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని స్పష్టం చేశారు. ఒకటి రెండు పోర్టబుల్ హ్యాండ్ మైకులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులు రక్షణ కల్పించాలని.. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు వీడియో చిత్రీకరణ చేయాలని పోలీసులు సూచించారు.
కాగా.. మహా పాదయాత్రకు తొలుత పోలీసుల అనుమతి కోరారు రైతులు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ gautam sawang అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ap high court రైతుల మహా పాదయాత్రకు శుక్రవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
కోర్టు తీర్పు నేపథ్యంలో నవంబరు 1న తొలిరోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగనుంది. అక్కడి నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, అలిపిరి మార్గం గుండా తిరుమలకు యాత్ర చేరుకుంటుంది. తమ పాదయాత్రకు అందరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.