ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 5వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 5వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. సీఎం జగన్ తిరుపతి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలిపిరిలో చిల్డ్రన్స్‌ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి, శ్రీనివాస సేతును ప్రారంభించనున్నారు. విద్యా కానుక బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. 

సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.. సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. టీటీడీ ఆధ్వర్యంలో దాదాపు రూ. 240 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. టాటా క్యాన్సర్ ఆస్పత్రికి ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. బర్డ్ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి హృదయాలయంలో గ్రహణమొర్రి బాధిత పిల్లల కోసం స్మైల్ ట్రైన్ వార్డును, వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ప్రత్యేక కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నట్టుగా చెప్పారు. గతేడాది కురిసిన వర్షాలతో దెబ్బతినడంతో.. పునర్నిర్మించిన శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నట్టుగా తెలిపారు.