ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజల కడుపు నింపడానికి కష్టపడుతున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజల కడుపు నింపడానికి కష్టపడుతున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ కాలంలో కూడా ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచిందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని.. స్కోచ్ అవార్డు ఇచ్చిందన్నారు. రైతు వెన్నంటే ఉండి సాయం అందించడం వల్లనే ఇది సాధ్యమైంది.

రైతుల గౌరవాన్ని పెంచేలా పథకాలు, కార్యక్రమాలు చేపట్టినట్టుగా కన్నాబాబు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోసం రూ. 36వేల కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు చేశామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో విప్లవాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వ్యవస్థలు దేశమంతా ఉండాలని ఆకాంక్షించారు. కల్తీ లేని విత్తనాలు,ఎరువులు, మందులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు...ఏటీఎంలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట దేవాలయాలు అని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించినట్టుగా చెప్పారు. ఆర్బీకేల నిర్వహణకు రూ.18 కోట్ల కేటాయింపు చేసినట్టుగా తెలాపారు. రైతు భరోసా కేంద్రాలపై జర్మనీ ప్రతినిధుల బృందం ప్రశంసలు నీతి ఆయోగ్ ఛైర్మన్ ప్రశంసలు కురిపించిందన్నారు. ఆర్బీకే యూట్యూబ్ ఛానల్ కు సిల్వర్ బటన్ వచ్చిందన్నారు. 

వివిధ అవసరాల కోసం పట్టణాలకకు వచ్చే రైతుల విశ్రాంతికోసం రూ. 52కోట్ల వ్యయంతో వైఎస్సార్ రైతు భవనాల నిర్మాణం చేపట్టినట్టుగా తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్మాణాలు చేపట్టనున్నట్టుగా మంత్రి చెప్పారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.

పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి ఏపీ ప్రభుత్వం.. 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది. ఇక, వ్యవసాయ రంగం కోసం వార్షిక బడ్జెట్‌లో రూ. 11,387.69 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

కేటాయింపులు..
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి రూ. 421.15 కోట్లు
వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 59.91 కోట్లు
వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి రూ. 122.50 కోట్లు
పశు సంవర్దక శాఖకు రూ. 1,027.82 కోట్లు
మత్స్య శాఖ అభివృద్ది కోసం రూ. 337.23 కోట్లు
వ్యవసాయం విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,000 కోట్లు
వైఎస్సార్ జలకళ- రూ. 50 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకానికి రూ. 7,020 కోట్లు
రైతు భరోసా కేంద్రాల బలోపేతానికి రూ. 18 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ. 1,802 కోట్లు
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు- రూ. 500 కోట్లు