అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోతున్న మెుట్టమెుదటి సమావేశాలు కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈనెల 12న అంటే బుధవారం ఉదయం 11.05 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఐదు రోజులపాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ శంభంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ఇకపోతే రెండోరోజు అనగా జూన్ 13న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పార్టీ సీనియర్ నేత ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను అధికారికంగా స్పీకర్ గా ఎన్నుకోనున్నారు. ఈనెల 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం ఈనెల 15,16 అసెంబ్లీకి సెలవులు. 

మళ్లీ ఈనెల 17న తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. అనంతరం ఈనెల 18తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.